అందరూ ఒంటరి వారే

>> Saturday, January 16, 2010


ఈ ప్రపంచంలో
ఎవరూ . . .
ఎవరికీ . . .
ఏమీ కారు .
అందరూ ఒంటరి వారే
ప్రేమలూ , ప్రమాణాలూ లేవు
ప్రణయ స్వప్నాలు లేవు
నిన్నటి దాకా తోడై నిలచిన వారు
నేడు స్మృతులలో కూడా లేరు
పరిచయాలు , స్నేహాలు , ప్రేమలు
అన్నీ... అబద్దమే
కనీసం నీడ కూడా మనది కాదు
జీవితం నావికుడు లేని
ఓ కాగితం పడవ
సుడి గుండంలో చిక్కు కున్నప్పుడు
మనసుకు తోడు ఎవరూ లేరు
దు ఖపు టలల శ్రేణులకు అంతమూ లేదు .

( సెహబా అక్తర్ ఉర్దూ కవితకు అనువాదం )

Read more...

>> Thursday, January 14, 2010

నీ చెంతకు రావాలనే వుంది
కొత్త గాయాలు కావాలనే వుంది
సంతోష తరంగం సమీపించి నపుడు
కూని రాగాలు తీయాలనే వుంది
కాలం నన్ను శోధనకు గురి చేస్తొంది
నిన్ను కూడా శోధించాలనే వుంది
మరచి పోవాలను కున్న మాట
వుండి వుండి గుర్తు కొస్తున్నది
కనులలో నీరు కదలాడి నపుడే
పెదవులపై చిరు నవ్వు దోబూచు లాడు తోంది
ఎన్ని సార్లు ఈ గుండెకు గాయమైనా
ప్రతీ సారీ నవ్వే నాకు శరణ్యమైంది
జాగు సేయకే మెరుపు తీగా
మత్తిల్లిన మనసును మండించాలనే వుంది
జీవితం మోముపై ముసుగు తీసి
వాస్తవం వెల్లడి చేయాలనే వుంది

( ' సికందర్ అలీ వజ్ద్ ' ఉర్దూ కవితకు స్వేచ్చానువాదం )

Read more...

>> Wednesday, January 13, 2010


రాత్రి తల వాకిట
తన సంతకం చేసి వెళ్లి పోయింది
ఇవ్వాల్టి రోజు కూడా గడచి పోయింది
పగలంతా ఎంత వెలుతురో ?
అయినా , మళ్లీ చీకటే జయించింది
ఏకాంతపు దుప్పటి కప్పుకొని
నాలో నేను ముడుచుకు పోతున్నాను
కనుల ముందే జ్ఞాపకాల తేరు మీద
నా గతమే వెళ్లి పోయింది
నిశ్శబ్దాల రొదలో పడి
నా గొంతే నాకు విన బడ కుండా పోయింది
కను కొలకుల చివర యుద్ధం చేస్తున్న
కన్నిళ్ళు నేడు జయించాయి
పగిలిన అద్దం ముందు నుంచొని
నన్ను నేను వెతుక్కుంటున్నాను


ఇలా కూర్చొని కూర్చొని
ఎంత సమయం గడచి పోయిందో ?
చూస్తూ చూస్తూనే
కాల నదిలో ఎన్ని నీళ్ళు ప్రవహించి
గతం కడలిలో కలసి పోయాయో ?

( ఆరిఫ్ ఖాన్ నియతి కి అనువాదం )

Read more...

మౌన రాగం

>> Sunday, January 10, 2010


మౌనం భాషగా మారినపుడు
మాటల అవసరం లేదు
మనుషుల సమక్షంతో పనిలేదు
పరస్పరం పలకరింపులూ అక్కర లేదు
పరిచయం , సాన్నిహిత్యం
అంత గాఢoగా మారినపుడు
అంతరాంతరాళాల్లో అనునిత్యం
స్నేహం పంచుకోవచ్చు
స్మృతుల సాన్నిహిత్యంలో
ఆనందం అనుభవించవచ్చు
ఆలోచనా తంత్రులపై
ఆనంద భైరవి ఆలాపించవచ్చు

Read more...

ఉత్తరం వ్రాయ లేదని చిన్న బుచ్చుకోకు నేస్తం !


ఎప్పుడో ఒక్క సారీ కాదు
ఏడాది కొక్క సారీ కాదు
ఏ కారణమూ లేకుండా
నాలో నేను నవ్వుకున్నప్పుడూ
మీరు పంచిన ఆప్యాయతల
తలపులలో తలమునకలై
కళ్ళు చెమర్చినపుడూ
వేల మందిలో వుంటూ ఒంటరి నైనపుడూ
అడుగు దూరానికీ ,
అనంతానికీ మధ్య ఎక్కడో
చూపు చిక్కుకు పోయినప్పుడూ
ఎప్పుడూ
పూవును చూసినపుడూ
తెమ్మెర స్పృశించి నపుడూ
జల్లులు కురిసి నపుడూ
హరివిల్లు విరిసి నపుడూ
వెన్నెల విర బూసి నపుడూ
పసిడి ఎండ పలకరించి నపుడూ
ఎప్పుడూ
మీరు నా చుట్టూనే వుంటే
మీ తలపులు మదిలో పదిలంగా వుంటే
మీ రూపాలు కళ్ళ ముందు మెదులుతూ వుంటే
ఆత్మీయులందర్నీ అక్కున చేర్చు కున్నట్టుగా వుంటుంది
ఉత్తరం వ్రాయ లేదని చిన్న బుచ్చుకోకు నేస్తం !
ఇవాళ కొత్తగా ఏమని వ్రాయను ?
మరచి పోతే గదా ! మళ్లీ గుర్తు చేసు కోను ?

Read more...

ఏ వెలుగులకీ ప్రస్తానం ?

>> Saturday, January 9, 2010



ఏ వెలుగులకీ ప్రస్తానం ?
ఎటు వైపు మన ప్రయాణం
ఊళ్ళకు ఊర్లను మింగేస్తూ
వేల ఎకరాల పొలాల్లో నీరింకకుండా చేస్తూ
ఆరేసి లేన్ల రోడ్లేసు కుంటూ . . .
నాగరికతా చిహ్నాలుగా చెప్పుకుంటూ

ఎందుకీ ఆత్రం
ఎందుకింత వడి , వేగం
తళతళలాడుతున్న
ప్రతి రోడ్డు నరబలి కోరుతోంది
నిత్యం వేల మంది సమిధలై పోతున్నారు
విప్లవమూ కాదు , యుద్ధమూ కాదు
ఎవరి బ్రతుకుల్లోనూ వెలుగులు నిండ లేదు
మన ఆత్రం ఆయనకీ అబ్బిందేమో
యములాడు
ఇంకా ఎందుకీ దున్నపోతు అనుకున్నాడేమో
అందుకే
రైలు , లారీ , బస్సు , కారు , మోటారు సైకిలు
ఏదైనా ఎక్కి వచ్చేస్తున్నాడు
పెరిగిన జనంతో బాటే
పని కూడా పెరిగింది కదా !
హడావుడిగా వచ్చేస్తున్నాడు
తప్పులు చేస్తున్నాడు
రోడ్డెక్కిన వారి నెవరినైనా
నిండు జీవితాలు నలిపేస్తున్న్నాడు
అభివృద్ధికి మారుపేరుగా
మనం వేస్తున్న రోడ్లన్నీ
ఉత్తరం వైపుకే . . . .

Read more...

నిరీక్షణ

>> Friday, January 8, 2010



చీకటి పడుతోందంటేనే
చిన్నగా వణుకు మొదలౌతుంది
ఇవాళైనా నా కలల చెలి
నన్ను కౌగిలిస్తుందో ? లేదో ?
కమ్మటి నిద్ర నన్ను సేద దీరుస్తుందో ? లేదో ?
ఎన్ని రాత్రుళ్ళు ఇలా ఎదురు చూశానో ?
సుషుప్తి కోసం ఎంతగా తపించి పోయానో !

చుట్టూ పరుచు కున్న చీకటిలో
కదలని కాలాన్ని తిట్టుకుంటూ
అలసి నిద్ర పోయిన అమ్మ కలల్ని
ఛిద్రం చేస్తానేమో ననే భయంతో కదలలేక
ఆలోచనల ఖార్ఖానా కట్టెయ్య లేక
చేతనా వస్థ శాపంగా పరిణమించిన ఈ క్షణం
చలనం లేని లిప్తలని
పళ్ళ బిగువున నెట్టు కుంటూ
రాత్రి రాక్షసిని గుండెల మీద మోస్తూ భరిస్తున్నాను
సుధీర్ఘ సుషుప్తిలోకి జారిన
ఊర్మిళ అదృష్టాన్ని తలచు కొని ఈర్ష్య పడుతున్నాను.
ప్రతీ ఉదయం
కళ్ళలో ఎర్ర కలువలు పూయిస్తూనే వున్నాను
అభయ మిచ్చి నిదుర పుచ్చే
చెలిమి సవ్వడి కోసం నిరీక్షిస్తూ నే వున్నాను

Read more...

వాస్తవం



కలల మొయిలు పై నుండి
కటిక నేల పైకి జారి పడ్డ వాణ్ని నేస్తం !
కళ్ళు తెరచి చూస్తే, కరగి పోయిన కలా
వాస్తవం చేదు మాత్రా మిగిలేయి

అప్పట్లో నేల పైన నడవనే లేదు
వదలి వేసిన దారులన్నీ
వైభవానికి మార్గాలనిపిస్తున్నాయి
అది భ్రమే నేమో కానీ
ముందన్నీ ముళ్ళ కంచె లే కనిపిస్తున్నాయి
అయినా తప్పదు
దారి బాగు చేసు కోవాలి

ఆనందాని కైనా , ఆవేదన కైనా , ఆక్రోశాని కైనా
కళ్ళు కొలను లయ్యేవి
గడచి పోయిన కాలం నేల పైకి దింపింది కానీ
నడకా నేర్ప లేదు
కన్నీళ్ళు నిండు కున్నాయి
బంధాలైతే పెరిగేయి కానీ
బ్రతుకులో ఒంటరి వాణ్ని

చిన్నవో , పెద్దవో
నాకుగా నేను
నాలుగు సమస్యల్ని సృ ష్టించు కున్నాను
ఎంత ప్రయత్నిం చినా
వేసిన చిక్కు ముడి విప్ప లేకున్నాను
కమ్మటి కల కందా మన్నా
కంటి నిండా కునుకు రాదు
వెళ్లి పోయిన వసంతం వేడు కున్నా రాదు.
(20 ల నుండి 30 లకు నా ప్రస్థానం )

Read more...

మా వూరు మూగ బోయింది

>> Monday, January 4, 2010


మా వూరు మూగ బోయింది
ఇది వరకూ నిద్ర లేచీ లేవగానే
ఇంటి ముందు చింత చెట్టుపై
రోజూ సింఫనీ జరిగేది
నులి వెచ్చటి నీరెండతో పాటుగా
పంచాయతీ రేడియో పలకరించేది
కోడి కూతలు , పశువుల కాలి గిట్టల సందడి
మెడలోని గంటల , మువ్వల సవ్వడి
పనుల కోసం పరుగులు
అదలింపులు , హెచ్చరికలు
పనులలో పాటలు
ఎంత హడావుడి ! ఏమి శబ్ద సౌందర్యం !

పండుగలోస్తే ఎంత సంబరం
గంగిరెద్దులు , సన్నాయి పాటలు
డప్పుల చప్పుళ్ళు , మల్లాయి కుక్కలు
గుడిలో గంటల మోత

నేడు నిశ్శబ్దం రాజ్య మేలు తోంది
ప్రకృతి పగ బట్టింది
పచ్చ దనం పారి పోయింది
కోయిల ఊరిని బహిష్కరించింది
పక్షులూ వెళ్లి పోయాయి
పెరిగిన మనుషుల ఆకలికి
కొక్కో రోక్కోలు , మేకలు ఏమీ మిగల్లేదు
ఎడారి దేశం నవాబు కోసం
పశువులూ తరలి వెళ్ళాయి
ఇక మెడల్లోని మువ్వల సవ్వడి
ఎక్కడని వెతకను ?

గాదెలు , కనిజాలూ కనుమరుగయ్యాయనేమో
చేటలతో పంచిన చేయి మొండి దయ్యిందనేమో
భిక్ష గాళ్ళూ ఊరిని బహిష్కరించారు
నాగరీకం అందరినీ నట్టింట్లో
టీవీకి కట్టి పడేసింది
కొత్తగా నేర్చుకున్న రాజకీయం
ఊరిని నాలుగు శకలాలుగా చేసింది
స్మశానానికి , ఊరికీ ఆట్టే తేడా లేదు
ఇళ్లన్నీ ఖరీదయిన సమాధుల్లాగే కనిపిస్తున్నాయి

మా ఊరిని పోల్చు కోవడానికి
నాకు మిగిలిన ఏకైక ఆనవాలు
ఊరి మధ్యలోని రాతి బురుజు
అది కూడా మూగదై పోయింది
పావురాలూ దాన్ని బహిష్క రించాయి.

Read more...

వెన్నెల స్నానం

>> Sunday, January 3, 2010


ఎంత సేపనీ ఒంటరిగా
ఈ వెన్నెల బరువుని మోయ గలను
ఎన్ని రాశులు చేయగలను
తెమ్మెర తో ఎన్ని ఊసులాడ గలను
ఎన్ని తారలని కళ్ళలో నింప గలను
ఎన్ని మాలలు కట్ట గలను
ఎంత సేపనీ వెన్నెలలో స్నానించ గలను
పార దర్శక మైన పండు వెన్నెల కురుస్తూ నే వుంది
పంచు కోలేని పరవశత్వం
ఎంత కనీ ఓప గలను
ఎంత గానో ఇష్టమైన ఏకాంతం
ఎందుకో మరి ఇంత భారం
ఎద కోయిల ఎంత సేపనీ పాడ గలదు
ఎన్ని రాగాలు పలుక గలదు
మనసు కలువ
ఎంత గానని విరియ గలదు.

Read more...

చెమరించని నయనం

>> Saturday, January 2, 2010


" నా కొఱకు చెమ్మగిలు
నయనమ్ము లేదను " చింత లేదు .
కల్మషం లేని నీ కన్నీళ్ళ తో
క్షాళింఛిన నా జన్మ ధన్యం

కరువు తీరా ఏడ్చి ఎన్ని రోజులయ్యిందో !
దు ఖం లోని సాంద్రత
సంతోషం లో లేదు
పంచిన నవ్వుల కంటే
పంచుకున్న భాధల లోనే
ఆత్మీయత వ్యక్తమౌతుంది
దు ఖాన్ని పంచు కోవడానికి
అంతరంగం తెలిసిన ఆత్మీయుల
ఒక మాట , ఒక చూపు , ఒక స్పర్శ చాలు

ఎందుకనో మరి
కరువు తీరా ఏడవాలా నుంది
నా కన్నీటితో తడిసే భుజం కోసం
అన్వేషిస్తూనే ఈ జీవితం అయిపోయేట్టుగా వుంది
ఈ దు ఖం ఎందుకో తెలియదు
ఎన్ని రోజులుగా మరుగున పడి వుందో తెలియదు
ఈ వేదన అనుభవిస్తేనే గానీ తెలియదు

అయినా కన్నీళ్ళ నెందుకు గుర్తు చేశావు కన్నా !
అవి ఎప్పుడు ఆవిరై పోయాయో తెలియదు
నా హృదయం ఎందుకు ఘనీభవించిందో తెలియదు
కన్నీళ్ళు మాత్రం నిండు కున్నాయి .

ఆత్మీయుల మరణాన్ని మించిన కష్టం ఏముంటుంది ?
వున్నా ఒక్క గానొక్క చెల్లెలి మరణం లోనూ
అవి దరి చేర లేదు
లేమిలో అమ్మ కష్టాలకు నేను సాక్ష్యం
ఇప్పుడు అన్నీ వుండి అదే క్లేశం
అయినా నా కళ్ళలో నీటి జాడ లేదు
దు ఖంతో గుండె పట్టేసినట్టున్న
సందర్భాలు చాలానే వున్నాయి
పొగిలి పొగిలి ఏడవాలన్న కోరిక బలీయమైంది
కన్నీటి తరంగం మాత్రం
కను రెప్పల చెలియలి కట్ట దాట లేదు
ఈ మాస్క్ ఎప్పుడు తగిలించు కున్నానో
ఎందుకని దాన్ని వదల లేక పోతున్నానో తెలియదు
యండమూరి 'వెన్నెల్లో ఆడ పిల్ల ' కొఱకు
చండీదాసు ' స్వప్న రాగ లీన ' కొఱకు
' మల్లీస్వరి 'కి , ' మాతృ దేవో భవ 'కు
చెమ్మగిలిన నా నయనం
నిజ జీవితంలో ఎందుకో నాకు నిరాశనే మిగిల్చింది

Read more...

తారే జమీ పర్



"ఆకాశం నుండి ఆకుల ఒడిలోకి
జారిన మంచు ముత్యాలు వాళ్ళు
పైనుండి పచ్చని పచ్చిక తివాచీ పైకి
నవ్వుతూ, తుళ్ళుతూ జారిన
నాజూకు తుహిన బిందువులు వాళ్ళు .
నేల మీది తారకలు వాళ్ళు !

శీతాకాలపు చలి ఉదయాన
ముంగిట్లో బంగారు కాంతులు నింపి
మనస్సులోని తమస్సులను పార ద్రోలి
కొంకర్లు పోతున్న చేతులలో రంగులు నింపడానికి
చెట్ల కొమ్మల చాటు నుండి జాలు వారిన
వెచ్చటి నీరెండ కిరణాలు వాళ్ళు .



ఆశల నగరాలు వాళ్ళు
సంతోషపు సెలయేళ్ళు వాళ్ళు
సేదదీర్చే చల్లని తెమ్మెరలు వాళ్ళు
పూదోట విరిసిన రాగాలు వాళ్ళు
జీవితపు మువ్వల రవళులు వాళ్ళు
హాయి గొలిపే మురళీ గానాలు వాళ్ళు
వేన వేల వర్ణాల సుమ బాలల మోము వాళ్ళు
పెద్దల దీవెనలు వాళ్ళు
ముదిమి పైబడ్డ బామ్మ బోసి నవ్వులు వాళ్ళు
మూసిన పిడికిళ్ళ లోంచి
మీకు తెలియకుండా జారి పోయిన
మీ బాల్యపు ఆనవాళ్లు
జీవన నందనపు గుభాళింపులు వాళ్ళు

కనుల పేటిక లలోని కమ్మటి నిద్రలా
కనిక రించిన నిద్రలో తియ్యని కలలా
స్వప్నంలో సాక్షాత్కరించిన దేవ దూతలా
సుమ బాలల నెచ్చెలులు సీతాకోక చిలుకల్లా
అర్థం తెలియని అందమైన బంధంలా
అద్బుత వర్ణాల రంగ వల్లికలా
విచ్చు కోను మొండి కేస్తున్న మొగ్గలా
ఆగని ప్రశ్నల వరదలా
నిశ్శబ్దంలో నవ్వులా
కురిసే చినుకుల సోయగానికి హరివిల్లులా
పరవళ్ళు తొక్కుతున్న నది చేసే ఇంద్ర జాలంలా
మధుర మైన కోయిల పాటలా
సరస్సు లోని అలలపై తేలియాడే చందమామలా
ఎండిన పెదవులపై మెరిసిన సంతోషపు తరగలుగా
అనునిత్యం చెవుల మార్మ్రోగే
ఇష్టమైన సంగీతంలా

అప్పుడప్పుడూ అమ్మమ్మలా
ఆరిందా కబుర్లు చెబుతూ
అలిగిన తాతయ్యలా మొండి కేస్తూ
నింగి నుండి నేలకు దిగిన తారకలు వాళ్ళు
మీ ప్రేమకు ప్రతి రూపాలు వాళ్ళు
మీ రంగుల కలలు వాళ్ళు
మీ భవితవ్యం వాళ్ళు ."

( తారే జమీ పర్ పాటకు స్వేచ్చానువాదం )

Read more...

మాటలతో చెలిమి


" అక్షరాలతో సహవాసం
ఎంత అదృష్టమో కదా !
మాటలతో చెలిమి
మనసును ఆవిష్కరించే కుంచె కదా !
కవిత నీ కన్న బిడ్డ కదా !
అందుకే
గొప్ప కోసం వ్రాయకు
ఎవరి మెప్పు కోసమూ వ్రాయకు
ప్రాసల ప్రయాసల కొఱకు వ్రాయకు
ఆలోచన నిన్ను నిలువనీయనపుడూ
సంతోషం నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసినపుడూ
సంవేదన నీ గుండెను మెలిపెట్టినపుడూ
వ్యక్తావ్యక్త వ్యధతో మనసు వ్యాకులమైనపుడూ
ప్రసవ వేదనకు సిద్దపడు.
పురిటి నెప్పుల అనుభవం పొందితేనే కదా !
మాతృత్వపు విలువ
పసితనపు లాలిత్యపు సొబగూ తెలుస్తాయి .
మనస్సులో మథనం జరిగితేనే కదా !
పదాల పొదుపూ ,పొందికా కుదురుతుంది .
ఆత్మ తృప్తి కొఱకు , ఆర్తుల కొఱకు
ఆనందం పంచటానికి
ఆవేదన పంచుకోవటానికి
ఆలోచనల పదును పెంచటానికి
ఎన్నిసార్లయినా పునర్జన్మకు సిద్దపడు. "

Read more...

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP