మా వూరు మూగ బోయింది

>> Monday, January 4, 2010


మా వూరు మూగ బోయింది
ఇది వరకూ నిద్ర లేచీ లేవగానే
ఇంటి ముందు చింత చెట్టుపై
రోజూ సింఫనీ జరిగేది
నులి వెచ్చటి నీరెండతో పాటుగా
పంచాయతీ రేడియో పలకరించేది
కోడి కూతలు , పశువుల కాలి గిట్టల సందడి
మెడలోని గంటల , మువ్వల సవ్వడి
పనుల కోసం పరుగులు
అదలింపులు , హెచ్చరికలు
పనులలో పాటలు
ఎంత హడావుడి ! ఏమి శబ్ద సౌందర్యం !

పండుగలోస్తే ఎంత సంబరం
గంగిరెద్దులు , సన్నాయి పాటలు
డప్పుల చప్పుళ్ళు , మల్లాయి కుక్కలు
గుడిలో గంటల మోత

నేడు నిశ్శబ్దం రాజ్య మేలు తోంది
ప్రకృతి పగ బట్టింది
పచ్చ దనం పారి పోయింది
కోయిల ఊరిని బహిష్కరించింది
పక్షులూ వెళ్లి పోయాయి
పెరిగిన మనుషుల ఆకలికి
కొక్కో రోక్కోలు , మేకలు ఏమీ మిగల్లేదు
ఎడారి దేశం నవాబు కోసం
పశువులూ తరలి వెళ్ళాయి
ఇక మెడల్లోని మువ్వల సవ్వడి
ఎక్కడని వెతకను ?

గాదెలు , కనిజాలూ కనుమరుగయ్యాయనేమో
చేటలతో పంచిన చేయి మొండి దయ్యిందనేమో
భిక్ష గాళ్ళూ ఊరిని బహిష్కరించారు
నాగరీకం అందరినీ నట్టింట్లో
టీవీకి కట్టి పడేసింది
కొత్తగా నేర్చుకున్న రాజకీయం
ఊరిని నాలుగు శకలాలుగా చేసింది
స్మశానానికి , ఊరికీ ఆట్టే తేడా లేదు
ఇళ్లన్నీ ఖరీదయిన సమాధుల్లాగే కనిపిస్తున్నాయి

మా ఊరిని పోల్చు కోవడానికి
నాకు మిగిలిన ఏకైక ఆనవాలు
ఊరి మధ్యలోని రాతి బురుజు
అది కూడా మూగదై పోయింది
పావురాలూ దాన్ని బహిష్క రించాయి.

0 వ్యాఖ్యలు:

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP