స్నేహితుడా ! .. సన్నిహితుడా ! .. హితుడా !

>> Friday, April 16, 2010


దిగంతానికి ఆవలివైపున నువ్వు
పడమటి దిక్కుకు చూపులు వేలాడేసి నేను
నాకు పగలు , నీకు రాత్రి
నీకు పని సమయం , నాకు పడుకునే సమయం
పరిచయం లేని వాళ్ళలా
పలకరింపులే లేకుండా .. ఎన్నాళ్ళిలా ?

తప్పెవరి దంటావు ? తప్పకుండా నాదే ..
పత్రిక పంపితే పక్షం రోజులకు గానీ
చేరని రోజుల్లో అయితే ఫరవా లేదు
ప్రస్తుతం ప్రపంచం పల్లెటూరే కదా !

ఇద్దరినీ బంధించిన సూత్రం ఇప్పటికీ పదిలమే
నిత్య స్వాప్నికుణ్ణి
కలసి గడపిన సమయాన్ని
ఎప్పుడు కావాలంటే అప్పుడు
కనుల ముందు అవిష్కరించు కోగలను
కానీ ఎన్నాళ్ళిలా ?

పడమటికి పయన మైన
నా స్నేహ భాస్కరుడు
మళ్లీ తూర్పున తప్పక ఉదయిస్తాడని ఆశ
ఇరవై వసంతాల పిదప
ఇక రాడేమోనన్న బెంగ

Read more...

>> Wednesday, April 14, 2010


కొద్దిగా స్వేచ్చను ప్రసాదించు
ఈ అనంత నీరవంలో
నన్ను నేను వెతుక్కోవడానికి,

కొద్దిగా స్వేచ్చను ప్రసాదించు
హృదయాంతరాళాల్లో
ఏ మూలనో పూడుకు పోయిన
ఈప్సితాలు ఈడేర్చుకోవడానికి

కొద్దిగా స్వేచ్చను ప్రసాదించు
నా పాద ముద్రలు పడ్డ
దారులను వెతుక్కోవడానికి

కొద్దిగా స్వేచ్చను ప్రసాదించు
నా స్వావలంబనకు చుక్కానిగా నిలిచే
నా సుషుప్త చేతనను వెతుక్కోవడానికి
ఈ ప్రపంచపు సమూహాలలో
నా అస్తిత్వం నిలుపుకోవడానికి
దుర్బల వేదనామయ జీవితానికో
గమ్యమూ, గమనము నిర్దేశించు కోవడానికి
కొద్దిగా స్వేచ్చను ప్రసాదించు

Read more...

కడలి చెంత ఓ సాయంత్రం


కంటి చూపు పయనించి నంత మేరా
భూమినంతా పరచుకొని సముద్రం
ఆకాశ మంతా ఆవరించుకొని వెన్నెల
పగలంతా పులుముకొన్న నీలి రంగు
రాత్రవ్వగానే ఎవరికిచ్చిందో ?
ఇప్పుడు మాత్రం చల్లని , తెల్లని
వెన్నెల లేపనం ఎంత అందంగా వుందో ?
నాతో సయ్యాటకు సింగారించుకొని సిద్ధమైనట్లుగా వుంది.
కళ్ళలో, తనువులో ,మనసులో, తలపులలో
అంతటా తానే అయ్యి అలుముకొంది
చెలిమికై చెంత నిలిచిన వారిపై ఎంత ప్రేమ !
చేరి పాదాలను మళ్లీ మళ్లీ ముద్దాడుతుంది
అప్పుడెప్పుడో అంత మందిపై విరుచుకు పడిన కాఠిన్యం
ఇప్పుడు ఎంతగా వెదకినా కనపడదే !
నిరంతర ఘోష... నాతో ఏదో చెప్పాలని ప్రయత్నం
ఏయే తీరాల్లో ఎంత మంది
గుండె బరువును తనలో ఒంపుకుంటోందో ?
ఏకకాలంలో ఎంత మందితో మాట్లాడు తోందో ?
అంతా కలగా పులగమై అర్థంకాని ఘోషలా వినిపిస్తోంది
శృతి చేస్తున్న సంగీతంలా వుంది
తన సమక్షంలో తాదాత్మ్యం ప్రసాదించి
నా చింతలు , భయాలు, సందేహాలూ
సమస్తమూ తుడిచి పెట్టి
ఏకాకితనాన్ని , ఏకాంతంగా
ఎంత అందంగా మలచిందో !

Read more...

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP