స్నేహితుడా ! .. సన్నిహితుడా ! .. హితుడా !

>> Friday, April 16, 2010


దిగంతానికి ఆవలివైపున నువ్వు
పడమటి దిక్కుకు చూపులు వేలాడేసి నేను
నాకు పగలు , నీకు రాత్రి
నీకు పని సమయం , నాకు పడుకునే సమయం
పరిచయం లేని వాళ్ళలా
పలకరింపులే లేకుండా .. ఎన్నాళ్ళిలా ?

తప్పెవరి దంటావు ? తప్పకుండా నాదే ..
పత్రిక పంపితే పక్షం రోజులకు గానీ
చేరని రోజుల్లో అయితే ఫరవా లేదు
ప్రస్తుతం ప్రపంచం పల్లెటూరే కదా !

ఇద్దరినీ బంధించిన సూత్రం ఇప్పటికీ పదిలమే
నిత్య స్వాప్నికుణ్ణి
కలసి గడపిన సమయాన్ని
ఎప్పుడు కావాలంటే అప్పుడు
కనుల ముందు అవిష్కరించు కోగలను
కానీ ఎన్నాళ్ళిలా ?

పడమటికి పయన మైన
నా స్నేహ భాస్కరుడు
మళ్లీ తూర్పున తప్పక ఉదయిస్తాడని ఆశ
ఇరవై వసంతాల పిదప
ఇక రాడేమోనన్న బెంగ

0 వ్యాఖ్యలు:

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP