మరణ శాసనం

>> Friday, March 18, 2011

కుత్తుకపై కత్తులు దింపే వాడొకడు
ఆమ్లంతో ఆశని పాతమౌతాడొకడు
చార్మినార్ పైనుండి పడదోస్తాడొకడు
నీ కిచ్చిన కూల్ డ్రింక్ లో గరళ మౌతాడొకడు

ప్రేమించకు చెల్లీ
అంతు లేని ప్రేమని పంచకు
అమాయకంగా అందరినీ నమ్మకు
నీ సహజాతం వదులు కోమంటున్నా

అమృత భాండం కోరి వలచి వస్తే
చేజేతులా పగుల గొట్టి
మగ వాడు తన ఉనికికి
మరణ శాసనం రాస్తున్నాడు

ఆకాశంలో సగం
ఈ అందమైన పూల తోట
ప్రేమగా మెడ చుట్టూ వేసిన చేతులు
పూల దండలు కావాలే తప్ప
ఉక్కు కౌగిలై ఉసురు తీయ కూడదు
మానవత్వం మృగ్యమై
మగవాడు మృగమై చిదిమేస్తున్నాడు

పరిణామ క్రమం తిరోగ మిస్తోంది
నేడు మనిషి మళ్లీ మృగ మౌతున్నాడు
ఇంతటి కాఠిన్యం, వంచన మోసం
మృగాల కెక్కడిది
ఆకలి వేసినపుడే వేటాడడం మృగ లక్షణం
అయినా స్వజాతిలో వేటాడిన జాడ లేదు కదా!
మనిషి అంత కన్నా హీనం
ప్రేమ,మోసం, దగా, వంచన
మన ఆయుధాలు

Read more...

మగువ-మల్లెలు

>> Friday, May 14, 2010

వేసవి కాలం . మండు టెండలు, మధురమైన మామిడి పండ్లు,కోయిల పాటలు అంతేనా? మత్తెంక్కించే పరిమళాల మల్లెల కాలం కూడా! సాయంకాలం జడలో మల్లెపూలు తురుముకోని ముద్దుగుమ్మ ఎవరూ వుండరేమో ? మా శ్రీమతి కూడా అంతే. ఇంకా ఎన్ని రకాల పూలున్నా ఈ కాలంలో దొరికే బొండు మల్లెల గుభాళింపే వేరు.నేను ఆఫీసు నుండి వస్తూ తీసుకొస్తే బావుంటుందని తన కోరిక .నాది ఆఫీసు నుండి బయలు దేరితే , పక్క చూపులు చూడ కుండా కళ్ళకు గంతలు కట్టిన గుఱ్ఱం వాటం. చూపు ముందున్న రోడ్డు మీద తప్ప మరి దేని మీద ధ్యాస వుండదు.తన కోరికా తీరదు.
నా సంగతి తనకు బాగా తెలుసు కనుక, నేను తీసుకు రాలేదని అప్పుడప్పుడు రుసరుసలాడినా సాయంత్రం తనే ఓపిక చేసుకుని వెళ్లి తెచ్చు కుంటుంది.రోజూ వెళ్ళడానికి ఇబ్బందనో ,లేక మూరెడు మల్లెపూలు పది రూపాయలే ? కాస్త ఎక్కువ కొంటే ధర తగ్గుతుందేమోననే మధ్య తరగతి మనస్తత్వమో, కొంచెం ఎక్కువే తెచ్చుకుని కొన్ని జడలో ముడుచు కుని ,మరి కొన్ని ఫ్రిజ్లో మరుసటి రోజుకు దాచు కోవడం తన అలవాటు.
నా ప్రమోషను, పోస్టింగులు తెలిసాక , ఆర్డర్లు అవీ అందాక హడావుడిగా వెళ్ళ వలసి వస్తుందేమో ,అప్పుడు కుదర దేమో , నా చెల్లెలు లక్ష్మి వాళ్లకు విషయం చెప్పి కాసేపు గడిపి వద్దామని ఆ సాయంత్రం జూబ్లి హిల్స్ బయలు దేరాము. నేను చేస్తున్న ఉద్యోగం పుణ్యమాని కారు నాకు అబ్బిన అదనపు సౌకర్యం . లేక పోతే ఈ మహా నగరంలో అనుకున్నదే తడవుగా వెళ్లి రావడం అంత సుళువు కాదు. బయటకు వెళుతున్నాము కదా ! చక్కగా ముస్తాబై తను తెచ్చుకున్న ఓ మూరెడు మల్లెపూలు జడలో పెట్టు కుంది. లక్ష్మితో, అమ్మతో ఆ సాయంత్రం ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణ మౌతుంటే లక్ష్మి ఓ మూరెడు మల్లెపూలు తన చేతిలో పెట్టింది. అప్పటికే తలలో పూలు వున్నాయి కనుక చేతిలోనే పట్టుకుని కారులో కూర్చుంటూ ముందర డాష్ బోర్డ్ పై పెట్టింది.
రాత్రి పది గంటలైనా , మిగతా అన్ని చోట్లా రోడ్డు పై రద్దీ కొంచెం పలుచ బడినా , ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ జంక్షన్ లో రద్దీ బాగానే వుంది. ఎదురుగా రెడ్ సిగ్నల్. సిగ్నల్ కోసం చూస్తూ వుంటే కారు పక్కన అలికిడి. పద్నాలుగు, పదిహేనేళ్ళ పిల్ల , పావడా పై చొక్కా వేసుకుని చేతిలో సాయంకాలం ఎడిషన్ పేపర్లు పట్టుకుని కారు పక్కకు వచ్చింది.చారడేసి కళ్ళు, ఎండల్లో తిరగడం వల్ల నలుపైనా రాత్రి సోడియం లైట్ల మసక వెలుతురులో బాగానే వుంది. ఏసీ వేసుకోవడం వల్ల అద్దాలు అన్నీ మూసి వున్నాయి.పేపర్లు చూపించి కొంటారా అన్నట్లు గా సైగ చేసింది. అవసరం లేదు పక్కకు వెళ్ళు అన్నట్లు నేను కూడా సైగ చేసాను. తను కదలలేదు. మళ్లీ సైగ చేసింది. పేపరు అమ్మాలన్న ఆత్రమేమో,అయినా పొద్దుటి పూటే పూర్తిగా పేపరు చదవని నేను రాత్రి పది గంటలకు కొంటానా ? తల అడ్డంగా వూపాను. సిగ్నల్ తొందరగా పడితే వెళ్ళ వచ్చు కదా అని చూస్తున్నాను.ఆ అమ్మాయి చేతిలో వున్న పేపరు తో పాటుగా కారులోకి చూపిస్తూ మళ్లీ సైగ చేసింది. ఈ సారి నన్ను అడగట్లేదు. మా ఆవిడ వైపు చూస్తూ అడుగు తోంది. తను కదలట్లేదు. సైగ చేస్తున్నా ఆ అమ్మాయి చూపులు కారు లోని డాష్ బోర్డ్ పైన వున్నాయి. అప్పుడు స్ఫురించింది, ఆ అమ్మాయి పేపరు గురించి కాక , డాష్ బోర్డ్ పైన వున్న పూలు ఇమ్మని అడుగు తోంది. జడలో పెట్టుకోకుండా కారులో పడేసారు కదా! తన కిస్తే బావున్నని తన అభిప్రాయం . ఎంతైనా ఆడపిల్ల కదా! మల్లెపూల పై కోరిక లేని దేవరికి? వాటిని అలా చూడగానే కావాలని పించిందేమో ! కొనుక్కునే శక్తి లేక, ఎదురుగా అలా పడి వున్న పూలపై కోరిక చంపు కోలేక, మనసులో ఏమనుకున్నా బిడియం కాస్త పక్కన పెట్టిఅడుగు తోంది. మా శ్రీమతి మాత్రం కదలట్లేదు.తనకు ఆ అమ్మాయి అడుగు తున్న దేమిటో అర్థం కాలేదనుకున్నా. పులు కావాలం టోం ది ,ఎంతైనా ఆడపిల్ల కదా! అని వివరించే ప్రయత్నం చేశా! అయినా కదల లేదు . ఈ లోపు సిగ్నల్ పడ్డది. ఆ అమ్మాయి సైగ చేస్తూనే వుంది. నాకు ఇవ్వాలని అనిపించినా ఏ రోజు మూరెడు పూలు తెచ్చివ్వని నాకు వాటిని దానం చేసే హక్కు లేదని ఊరుకున్నా. ఈ లోపు సిగ్నల్ పడ్డా వీడు కదలడేమిటని వెనుక వాళ్ళ అసహనం హారన్ల పై చూపిస్తున్నారు.తప్పని సరై సిగ్నల్ పడింది నేను వెళ్ళాలి తప్పుకో అని ఆ అమ్మాయికి సైగ చేశా. ఈ సారి తన అసహనాన్ని కొంచెం గట్టిగానే ప్రదర్శించింది . కారు అద్దం పై కొంచం గట్టిగానే చరిచి పక్కకు వెళ్ళింది అదోలా చూస్తూ. చురుక్కుమన్న చూపు కాస్త గట్టిగానే గుచ్చు కొంది.
కారు కొంచెం దూరం వెళ్ళాక శ్రీమతితో అన్నాను ఎంతైనా ఆడపిల్ల కు మల్లెపూలు చూడ గానే మనసు జివ్వు మంటుంది కదా అని . తను చిన్న నవ్వు నవ్వి వూరు కుంది. మళ్లీ ఇల్లు చేరే వరకూ ఏమీ మాట్లాడ లేదు. కానీ కారు దిగుతూ మాత్రం తనలో తను సణుక్కుంటోంది పది రూపాయల పూలే కదా ఇచ్చేసి వుండాల్సింది. అవి కూడా నేనేమి డబ్బులు పెట్టి కొనుక్కో లేదు కదా నాకున్నాయి కదా మరి ఇవ్వడానికి చేతులు రాలేదెందుకో ? అనుకుంటూ .
ఆశ పడ్డ ఆ పిల్లను తప్పు పట్ట లేను. ఎన్ని వున్నా పూల పై ఆశ చావని ఈ కొమ్మను తప్పు పట్టలేని నిస్సహాయత నాది. ఏ రోజైనా తను అడగ కుండా మూరెడు మల్లె పూలు తెచ్చి ఇచ్చి వుంటే , ఈ రోజు ఇవ్వడానికి స్వతంత్రించే వాడినేమో!

Read more...

విభజన

>> Thursday, May 6, 2010

మన నుండి మనల్ని
వేరు చేయడానికి వేన వేల ప్రయత్నాలు

ఎన్ని రకాలుగా విడి పోదాం ?
కులాలుగా, శాఖలుగా
మతాలుగా , జాతులుగా
వర్ణాలుగా , వర్గాలుగా
ఉన్న వాళ్ళుగా, లేని వాళ్ళుగా
దేశాలుగా, ప్రాంతాలుగా , భాషలుగా
ఖండ ఖండాలుగా ఎన్ని ముక్కలవుదాం ?
ఇంకా ఎన్నెన్ని రకాలుగా విడ గొట్ట బడదాం ?

ఒక్కొక్క విభజన వెనుకా
ఎన్ని స్వార్థాలు , మరెన్ని కుట్రలు ?
చైతన్యం చిగురించ కుండా
రక్తం పారించి
రణ భూమిగా, మరుభూమిగా
మార్చే ప్రయత్నాలు ఎన్నెన్నో ?
రగిల్చిన విద్వేషాలు , వైషమ్యాలు ఇంకెన్నో ?
ఒక్కొక్క సందర్భంలో
మన నుండి మనల్నే
వేరు చేయడానికి వినిపించిన కారణాలు
ఎన్నో ? ఎన్నెన్నో ?

పరస్పరం ప్రేమించడానికీ ,
చేయి చేయి పట్టి కలసి నడవడానికీ
మనం మనుషులమన్న
ఒక్క కారణం చాలదా ?

Read more...

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP