కడలి చెంత ఓ సాయంత్రం

>> Wednesday, April 14, 2010


కంటి చూపు పయనించి నంత మేరా
భూమినంతా పరచుకొని సముద్రం
ఆకాశ మంతా ఆవరించుకొని వెన్నెల
పగలంతా పులుముకొన్న నీలి రంగు
రాత్రవ్వగానే ఎవరికిచ్చిందో ?
ఇప్పుడు మాత్రం చల్లని , తెల్లని
వెన్నెల లేపనం ఎంత అందంగా వుందో ?
నాతో సయ్యాటకు సింగారించుకొని సిద్ధమైనట్లుగా వుంది.
కళ్ళలో, తనువులో ,మనసులో, తలపులలో
అంతటా తానే అయ్యి అలుముకొంది
చెలిమికై చెంత నిలిచిన వారిపై ఎంత ప్రేమ !
చేరి పాదాలను మళ్లీ మళ్లీ ముద్దాడుతుంది
అప్పుడెప్పుడో అంత మందిపై విరుచుకు పడిన కాఠిన్యం
ఇప్పుడు ఎంతగా వెదకినా కనపడదే !
నిరంతర ఘోష... నాతో ఏదో చెప్పాలని ప్రయత్నం
ఏయే తీరాల్లో ఎంత మంది
గుండె బరువును తనలో ఒంపుకుంటోందో ?
ఏకకాలంలో ఎంత మందితో మాట్లాడు తోందో ?
అంతా కలగా పులగమై అర్థంకాని ఘోషలా వినిపిస్తోంది
శృతి చేస్తున్న సంగీతంలా వుంది
తన సమక్షంలో తాదాత్మ్యం ప్రసాదించి
నా చింతలు , భయాలు, సందేహాలూ
సమస్తమూ తుడిచి పెట్టి
ఏకాకితనాన్ని , ఏకాంతంగా
ఎంత అందంగా మలచిందో !

0 వ్యాఖ్యలు:

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP