తారే జమీ పర్

>> Saturday, January 2, 2010



"ఆకాశం నుండి ఆకుల ఒడిలోకి
జారిన మంచు ముత్యాలు వాళ్ళు
పైనుండి పచ్చని పచ్చిక తివాచీ పైకి
నవ్వుతూ, తుళ్ళుతూ జారిన
నాజూకు తుహిన బిందువులు వాళ్ళు .
నేల మీది తారకలు వాళ్ళు !

శీతాకాలపు చలి ఉదయాన
ముంగిట్లో బంగారు కాంతులు నింపి
మనస్సులోని తమస్సులను పార ద్రోలి
కొంకర్లు పోతున్న చేతులలో రంగులు నింపడానికి
చెట్ల కొమ్మల చాటు నుండి జాలు వారిన
వెచ్చటి నీరెండ కిరణాలు వాళ్ళు .



ఆశల నగరాలు వాళ్ళు
సంతోషపు సెలయేళ్ళు వాళ్ళు
సేదదీర్చే చల్లని తెమ్మెరలు వాళ్ళు
పూదోట విరిసిన రాగాలు వాళ్ళు
జీవితపు మువ్వల రవళులు వాళ్ళు
హాయి గొలిపే మురళీ గానాలు వాళ్ళు
వేన వేల వర్ణాల సుమ బాలల మోము వాళ్ళు
పెద్దల దీవెనలు వాళ్ళు
ముదిమి పైబడ్డ బామ్మ బోసి నవ్వులు వాళ్ళు
మూసిన పిడికిళ్ళ లోంచి
మీకు తెలియకుండా జారి పోయిన
మీ బాల్యపు ఆనవాళ్లు
జీవన నందనపు గుభాళింపులు వాళ్ళు

కనుల పేటిక లలోని కమ్మటి నిద్రలా
కనిక రించిన నిద్రలో తియ్యని కలలా
స్వప్నంలో సాక్షాత్కరించిన దేవ దూతలా
సుమ బాలల నెచ్చెలులు సీతాకోక చిలుకల్లా
అర్థం తెలియని అందమైన బంధంలా
అద్బుత వర్ణాల రంగ వల్లికలా
విచ్చు కోను మొండి కేస్తున్న మొగ్గలా
ఆగని ప్రశ్నల వరదలా
నిశ్శబ్దంలో నవ్వులా
కురిసే చినుకుల సోయగానికి హరివిల్లులా
పరవళ్ళు తొక్కుతున్న నది చేసే ఇంద్ర జాలంలా
మధుర మైన కోయిల పాటలా
సరస్సు లోని అలలపై తేలియాడే చందమామలా
ఎండిన పెదవులపై మెరిసిన సంతోషపు తరగలుగా
అనునిత్యం చెవుల మార్మ్రోగే
ఇష్టమైన సంగీతంలా

అప్పుడప్పుడూ అమ్మమ్మలా
ఆరిందా కబుర్లు చెబుతూ
అలిగిన తాతయ్యలా మొండి కేస్తూ
నింగి నుండి నేలకు దిగిన తారకలు వాళ్ళు
మీ ప్రేమకు ప్రతి రూపాలు వాళ్ళు
మీ రంగుల కలలు వాళ్ళు
మీ భవితవ్యం వాళ్ళు ."

( తారే జమీ పర్ పాటకు స్వేచ్చానువాదం )

0 వ్యాఖ్యలు:

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP