ప్రపంచ మాతృభాషాదినోత్సవం

>> Saturday, February 27, 2010

ప్రపంచ మాతృభాషాదినోత్సవం
ప్రపంచమంతా పండుగ చేసుకోగలరేమో
నా సందర్భం వేరు కదా తల్లీ !
పండుగ ఎలా చేసుకోను ?

మాట నేర్పిన తెలుగు
తల్లి కాదన్నారు
మరి తెలంగాణ , తల్లి ఎలా అయ్యిందో
అర్థంకాని అయోమయంలో
పండుగ ఎలా చేసుకోను ?

నీ బిడ్డలందరం
నీ జీర్ణవస్త్రాన్ని చెరోముక్కా
పంచుకోవడానికి సిద్ధపడి
పండుగ ఎలా చేసుకోను ?

నువ్వు నేర్పని పరుష పద జాలంతో
ఒకరినొకరం తిట్టుకుంటూ
కలత చెందిన మనసుతో
కన్నీటి పర్యంతమౌతూ
పండుగ ఎలా చేసుకోను ?

ప్రాచ్య దేశాల పలుకు తేనెల తల్లీ
నీకోసం పండుగ చేసుకోలేని
నా నిస్సహాయతను మన్నించు.

మానవత్వం


చావుని తృణీకరించినవాడు వీరుడే !
కళ్ళెదుటే కాలిపోతున్నా
కదలని వాడు .. ? కరగని వాడు ...??

చేష్టలుడిగి చోద్యం చూస్తున్నాం.
వార్తలు చేస్తున్నాం
"ఆత్మహత్యలొద్దు ఉద్యమాలు ముద్దంటూ'
చట్టబద్ధమైన హెచ్చరికలు చేస్తున్నాం.
మండుతున్న దేహాల చెంత చలి కాగుతున్నాం
మన ఖాతాలో కాలి పోయే
ఉన్మాదం కోసం వెతుక్కుంటున్నాం.

అనాదిగా మనకు అలవాటే
అవమానభారానికి అవనీ తనయ
మంటల్లోకి దిగితే
అమ్మా! నువ్వు పునీతవన్నాం
దాన్నో ఘనకార్యం చేశాం
అదే ఆదర్శమంటూ అబలల్ని
చితుల్లోకి నెట్టాం .

వారించడానికి కదలని చేతులు
జైకొట్టడానికి వేలాదిగా కదులుతాయి
మనిషిని మనిషే మంటల్లోకి నెట్టుకునే
మహోన్నత సంస్కృతి మన మానవత్వం .

ఇవ్వాళ ... వాన కురిస్తే బావుణ్ను

>> Thursday, February 4, 2010


ఇవ్వాళ ... వాన కురిస్తే బావుణ్ను
ఆకాలమే . . . అయినా
ఇవ్వాళ భోరున వాన కురిస్తే బావుణ్ను
మనసు నిండా అలుముకున్న ముసురు
కరిగి కన్నీటి వానగా మారి పోతే బావుణ్ను

ఎక్క డెక్క డివో స్వార్థ మేఘాలు
ఒక్కటొక్కటిగా వచ్చి చేరి
జాతి సమస్తాన్నీ కప్పేశాయి
ఒరుసుకున్నప్పు డల్లా
భయంకరంగా ఉరుముతున్నాయి
రాపిడి ఎక్కువైనప్పుడు
విద్యుల్లతల తాకిడికి
ఎక్కడి వారో ? ఏ తల్లులు కన్న బిడ్డలో
ఈ ముసురుతో ఏ సంబంధము లేక పోయినా
మాడి మసై పోతున్నారు

ప్రతీ గుండెలో దిగులు గూడు కట్టుకున్నా
ఇంత నిర్లిప్తత ఎందుకో ?
ఏ కన్నూ చెమరించడం లేదెందుకో ?
అలక బూనిన అన్ననో ,తమ్ముణ్నో ?
అక్కనో , చెల్లెలినో అక్కున చేర్చు కుంటే చాలు
ఇప్పటి దాకా కమ్ముకున్న మబ్బులు
ఒక్క టొక్కటిగా విడి పోతాయి
ఒక్కో నయనం నుండి చినుకు
ఒక్క టొక్కటే అయినా
జాతి సమస్తం చెమరిస్తే
జడి వాన కురవదా ?
కమ్ము కున్న కుళ్ళు కొట్టుకు పోదా ?
అపార్థాలు తొలగి పోవా?
మనసులు తేలిక పడవా?

కుండ పోతగా కురిసి
ఈ ముసురు వీడి పోతే బావుణ్ను
హరివిల్లు విరిస్తే బావుణ్ను.

  © Blogger templates Shiny by Ourblogtemplates.com 2008

Back to TOP